హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్న హైడ్రా తీరుపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ‘హైడ్రాకు ఉన్న పరిధులు ఏంటి.. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు.. ఎవరు నడిపిస్తున్నారు..’ అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల రక్షణ కోసం హైడ్రా ఏర్పాటు అభినందించదగ్గదే అయినా కూల్చివేతలపైనే చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది.
ఔటర్ రింగ్ రోడ్డు(ORR) సమీపంలో గల జన్వాడ ఫాంహౌజ్ కూల్చొద్దంటూ వాదనలు కొనసాగాయి. FTL(ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోని కట్టడాల్ని హైడ్రా కూల్చివేస్తున్న దృష్ట్యా తమ ఫాంహౌజ్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(AAG) కోర్టుకు వివరాలు తెలియజేశారు. అయితే మరింత సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున కేసును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.