
Published 22 Dec 2023
పోలీసు శాఖలో పోస్టింగ్ అంటేనే పొలిటికల్ లెటర్స్ అన్నట్లుగా మారిపోయింది రాష్ట్రంలో పరిస్థితి. నియోజకవర్గ నేత అండ లేనిదే పోలీస్ పోస్టింగ్స్ లేవన్న స్థాయికి చేరుకున్నాయి విమర్శలు. ఒక ఎస్ఐని బదిలీ చేయాలన్నా DIG సైతం ఏమీ చేయలేని అచేతనావస్థ ఏర్పడిందన్నది అందరి నుంచీ వినపడుతున్న మాటలు. కానీ ఇప్పుడు కాలం మారినట్లే కనపడుతోంది. కొత్త పోలీస్ బాస్ వార్నింగ్ చూస్తేనే ఇకపై సిఫార్సు లెటర్ల(Political Interference)కు కాలం చెల్లినట్లేనని అర్థమవుతున్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్(CP)గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. పోలీసుల పోస్టింగ్ లపై తీవ్ర కామెంట్స్ చేశారు. లెటర్లతో వస్తే లూప్ లైన్ కేనన్న హెచ్చరికల్ని పంపారు.
తిక్క వేషాలు వేస్తే…
సీపీ శ్రీనివాస్ రెడ్డి మాటలు చూస్తే… ‘సిఫార్సు లెటర్లు తెచ్చి పోస్టింగ్ అడిగితే సీరియస్ గా తీసుకుంటాం.. సమర్థులైన అధికారులకు మాత్రమే కీలక పోస్టింగ్స్ ఉంటాయి.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్స్ లో పాలిటిక్స్ లేకుండా చూస్తాం.. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం, నేరాల్లో పాల్గొనడం వంటి కారణాలతో ఎనిమిది మందిపై కేసులు పెట్టాం.. ఏడుగురు అధికారులు సర్వీస్ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు.. ఇలా తిక్క తిక్క వ్యవహారాలతో ఉన్న 50 మందిపై విచారణ కూడా జరుగుతోంది’ అని సీపీ తెలియజేశారు. వారం క్రితమే ఆయన హైదరాబాద్ CPగా ఛార్జ్ తీసుకున్నారు. అప్పట్నుంచి నేరాల కన్నా ఎక్కువగా తమ శాఖపైనే దృష్టి పెట్టారు. పోస్టింగ్ ల విషయంలో నెలకొన్న అప్రపథ(Bad Name)ని తొలగించాలన్న టార్గెట్ తో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. తాజా వార్నింగ్ ద్వారా అధికారులందరికీ హెచ్చరికలు పంపినట్లయింది.