
కాంగ్రెస్ ముఖ్య నేత, ఎల్.బి.నగర్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) నివాసంపై పోలీసులు ఉన్నట్టుండి సోదాల(Searches)కు దిగారు. అర్థరాత్రి పూట దాడులకు వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. పోలీసులను ఆయన అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య కాసేపు వివాదం నెలకొనడంతోపాటు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని మధుయాష్కీ ప్రశ్నించారు. అయితే డయల్ 100కు కాల్ రావడంతో సోదాలకు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన నివాసంలో భారీగా నగదు ఉందని పోలీసులు అంటుండగా.. మధుయాష్కీ వాటిని ఖండించారు.
భయాందోళనకు గురిచేస్తున్నారు…
సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటిపైకి దాడులకు దిగి భయాందోళనకు గురిచేయాలని చూస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. పోలీసుల అనూహ్య దాడితో ఆయన అనుచరులు గందరగోళానికి గురయ్యారు. అవాస్తవాలతో అర్థరాత్రి పూట సోదాల పేరిట హడావుడి చేయడంపై మండిపడుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతల్ని భయపెట్టాలని చూస్తున్నారని మధు మండిపడ్డారు.