ఎక్సైజ్ శాఖలో ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ల వెయిటింగ్ కు ఎట్టకేలకు తెరపడింది. ఎస్సై నుంచి సీఐలుగా ప్రమోషన్ పొందిన 34 మందికి పోస్టింగ్ లు కట్టబెడుతూ ఉన్నతాధికారులు ఆర్డర్స్ జారీ చేశారు. ఎస్సై నుంచి సీఐగా ప్రమోషన్ పొందిన అధికారులకు ఈ లెక్కన సంవత్సరం తర్వాత పోస్టింగ్ లు దక్కాయి. మల్టీజోన్-1లో 28 మందికి, మల్టీజోన్-2లో ఆరుగురికి పోస్టింగ్స్ ఇస్తూ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి. ఏ శాఖలో లేని విధంగా ప్రమోషన్లు పొందినా దాన్ని అందుకోలేని పరిస్థితుల్లో ఎస్సైలు ఉండేవారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనోవేదనకు గురవుతూ… కొత్త పోస్టు వచ్చిందని సంబరపడాలో, పాత పోస్టు నుంచి బయటకు రావడం లేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండేవారు. ఇలా ఏడాది కాలానికి పైగా ఎదురుచూపులతోనే కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ప్రమోషన్లు రావడంతో ఇక కొత్త బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.
పోలీసు శాఖలో ఎస్సై ఆ పై ర్యాంకు కేడర్ అధికారులకు కచ్చితంగా రెండు లేదా మూడేళ్లకు రెగ్యులర్ గా ట్రాన్స్ ఫర్స్ జరుగుతుంటాయి. ఒక స్టేషన్ లో నాలుగేళ్లు పనిచేసే అధికారులు రాష్ట్రంలో చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ ఎక్సైజ్ శాఖలో గత 6 సంవత్సరాల కాలానికి పైగా ఒకే పోస్టింగ్ లో అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మద్యం ఏరులై పారే ఎలక్షన్స్ లో వాటిని అరికట్టి EC నిబంధనల మేరకు ప్రచారం సజావుగా సాగేలా… ఎక్సైజ్ శాఖనే కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. అందుకు ఉదాహరణే… మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలు. చాలా చోట్ల అక్రమ మద్యం నిల్వల్ని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించింది.
ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ లో ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి దాకా బదిలీలు జరిగాయి. ఒకే సెగ్మెంట్, ఒకే సబ్ డివిజన్ లో ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటే డీఎస్పీ స్థాయి అధికారులకు సైతం స్థాన చలనం కల్పించారు. ముఖ్యంగా సొంత జిల్లాల్లో పనిచేసే వారిని కూడా అక్కణ్నుంచి పంపించివేసి ఇతర జిల్లాల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. మరి లా అండ్ ఆర్డర్ మాదిరిగా తమనూ ఎందుకు చూడలేకపోతున్నారని ఎక్సైజ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఒకే సీట్లో పాతుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ల దృష్ట్యా ఇకనైనా తమను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.