
Published 12 Dec 2023
రాష్ట్రంలో ఇంతకాలం అప్రాధాన్య పోస్టుల(Loop Line)కే పరిమితమైన పవర్ ఫుల్ ఆఫీసర్లకు ఎట్టకేలకు గుర్తింపు దక్కింది. పలువురు IPS అధికారులను బదిలీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సమర్థులైన వారికి కీలక స్థానాల్ని అప్పజెప్పింది. నాలుగు అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ నలుగురిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్గనైజేషన్ అండ్ లీగల్ అడిషనల్ DGగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(1994 బ్యాచ్)ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్(CP)గా నియమించారు. అటు సైబరాబాద్ CPగా అవినాశ్ మహంతి, రాచకొండ కమిషనరేట్ CPగా సుధీర్ బాబు, యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్యకు బాధ్యతలు కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సందీప్ శాండిల్య, శ్రీనివాస్ రెడ్డి, అవినాశ్ మహంతి ప్రధాన పోస్టులకు దూరంగా ఉండిపోయారు.
సందీప్ శాండిల్య ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. ఎన్నికలకు ముందు సి.వి.ఆనంద్ ను తప్పించి ఆయన స్థానంలో శాండిల్యకు EC బాధ్యతలు అప్పజెప్పింది. ఇప్పటిదాకా సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న స్టీఫెన్ రవీంద్రతోపాటు రాచకొండ CPగా పనిచేస్తున్న దేవేంద్రసింగ్ చౌహాన్ ను DGPకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అవినాశ్ మహంతి పేరు చేబితేనే హడల్. పోలీసు శాఖలో ఈ అధికారులకు నిక్కచ్చి, సమర్థులైన అధికారులుగా పేరుంది. అటు యాంటీ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో నిన్ననే రేవంత్ మీటింగ్ నిర్వహించారు. ఆ విభాగాన్ని బలోపేతం చేసే దిశగానే సందీప్ శాండిల్యను పంపించారా అన్న మాటలు వినపడుతున్నాయి. అయితే హైదరాబాద్ సీపీ వంటి కీలక స్థానం నుంచి శాండిల్యను తప్పించడం ఆశ్చర్యంగా ఉన్నా ఆ స్థానంలో శ్రీనివాస్ రెడ్డిని తీసుకోవడం బెటరే అని పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. మొత్తానికి ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరు గల అధికారులకు కీలక పోస్టింగ్ లు దక్కాయి.