
Published 07 Dec 2023
ప్రగతి భవన్ ఇక ప్రజాభవన్ గా మారుతుందని ఇంతకుముందే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనుకున్న మాటను నిలుపుకొన్నారు. ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్ధలు కొట్టించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పొద్దున్నుంచే ప్రగతి భవన్ పై దృష్టిసారించిన అధికారులు.. దాని చుట్టూ వేసిన ఫెన్సింగ్ తోపాటు ఇనుప షెడ్లను కూల్చివేశారు. అందరూ వచ్చేందుకు వీలుగా రోడ్లను నీట్ గా చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన అనంతరం మాట్లాడిన రేవంత్.. ఇది ప్రజా ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. మేం పాలకులం కాదు.. సేవకులం అంటూ ప్రసంగించారు.
హక్కుల్ని కాపాడే వేదిక
ప్రగతి భవన్ ఇక ప్రజల హక్కులు కాపాడే వేదికగా మారుతుందని, ఈ జ్యోతిరావుపూలే భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములని, తమ ఆలోచనల్ని అందరూ పంచుకునేందుకు ప్రగతి భవన్ ను వేదిక చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేపు పొద్దున 10 గంటలకు ప్రగతి భవన్ లో నిర్వహించే ప్రజా దర్బార్ కు ఎవరైనా రావచ్చొని తెలిపారు.