Published 25 Nov 2023
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి డబ్బులు అవసరమైతే ప్రాజెక్టులు నిర్మిస్తారని, ప్రజల్ని పూర్తిగా దగా చేసిన ప్రభుత్వం BRSది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో KCR సర్కారు భారీ అవినీతికి పాల్పడిందని కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే, పరీక్ష పేపర్ల లీకేజీతో వేలాది మంది యువకులను నిండా మోసం చేశారన్నారు. CM కేసీఆర్, PCC ప్రెసిడెంట్ ఇద్దర్నీ ఓడించాల్సిన అవసరముందని, ఆ రెండు పార్టీల బంధుప్రీతిని తిప్పికొట్టేందుకు జాగ్రత్తగా ఓటేయాలని పిలుపునిచ్చారు. రైతులు, SC వర్గీకరణతోపాటు ప్రజా సంక్షేమానికి BJP కట్టుబడి ఉందన్న విషయం పార్టీ మేనిఫెస్టోను చూస్తే అర్థమవుతుందని, కానీ రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలే ఇంకా నడుస్తున్నాయన్నారు.
కచ్చితంగా BC సీఎం
కేంద్ర మంత్రి వర్గంలో BCలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చామన్న మోదీ.. తెలంగాణలో అధికారంలోకి వస్తే BC CM బాధ్యతలు చేపడతారని మరోసారి స్పష్టం చేశారు. 7 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, దళిత వ్యక్తిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల అకౌంట్లలో రూ.2.75 లక్షల కోట్లు జమ చేశామని ప్రధాని తెలియజేశారు.