Published 24 Dec 2023
మూడేళ్లలోనే పూర్తయి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మేడిగడ్డ ప్రాజెక్టులో లొసుగులు బయటపడ్డ వేళ.. దాన్ని సరిచేయాలంటే ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకంలోని నీటినంతా ఖాళీ చేయాల్సి వస్తోంది. కుంగుబాటుకు గురైన లక్ష్మీ బ్యారేజీ(మేడిగడ్డ)తోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లోని నీటిని సైతం ఖాళీ చేయాల్సి ఉందని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. మేడిగడ్డ ఏడో బ్లాకులో కుంగుబాటు జరిగినపుడు బ్యారేజీ నుంచి 10 TMCల నీటిని వదిలేశారు. అయితే తాగుకు, యాసంగి పంటలకు ఉంచిన ఆ కొద్ది కాస్త జలాలు కూడా ఇప్పుడు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డలో బ్లాక్ కుంగిపోవడానికి, పియర్స్ దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే నీటిని మొత్తం ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. రాష్ట్రం ఎంతో ఆశలు పెట్టుకున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుల్లోని నీటిని మొత్తం ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమైన విషయమే.
‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రాజెక్టుకే లక్ష కోట్లు కాలేదు, అంత మొత్తం అవినీతి ఎలా జరుగుతుందంటూ BRS అధినేతలు ఎదురుదాడికి దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో గత రెండు నెలలుగా కొన్ని ప్రధాన విషయాలు సీక్రెట్ గా మారగా.. ఎన్నికల వేళ అసలు అవి బయటకు రాకుండా పోయాయి. తమదే అధికారమంటూ BRS, కాంగ్రెస్ స్పష్టం చేసిన తరుణంలో ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు విషయాలు మరుగున పడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి వాతావరణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కో విషయం బయటపడుతూనే ఉంది. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు ఖాళీ చేయాల్సి వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో.