
అనుకున్న మేరకు అడ్మిషన్లు రాకపోవడం మైనారిటీ గురుకులాల స్టాఫ్ కు తలనొప్పిలా తయారైంది. వారి జీతాలు(Salaries) ఆపేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులంతా ఆవేదన చెందుతున్నారు. మైనారిటీ రెసిడెన్షియన్ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు 80 శాతం టార్గెట్ పెట్టారు. తక్కువగా అడ్మిషన్లు వచ్చిన కాలేజీ ప్రిన్సిపల్స్ కి ఇప్పటికే షోకాజ్ నోటీసులు పంపించారు. కేవలం నోటీసులకే పరిమితం కాకుండా ఏకంగా వారి జీతాలకే ఎసరు పెట్టారు. మొత్తం 204 కాలేజీలకు గాను 81 కాలేజీల్లోని ప్రిన్సిపళ్లు, లెక్చరర్లకు జులై నెల శాలరీ నిలిపివేశారు. జీతాలు నిలిపివేస్తూ ‘తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ(TMREIS)’ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పే స్లిప్(Pay Slip)లు రావాల్సి ఉండగా… కొందరివి విత్ హెల్డ్(Withheld)లో పెట్టినట్లు మెసేజ్ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 81 కాలేజీల్లోని స్టాఫ్ కు జీతాలు ఆపేయడంతో 600 మందికి పైగా దాకా ఆవేదనలో ఉన్నారు. ఒక్కో కాలేజీలో ప్రిన్సిపల్ తోపాటు లెక్చరర్లు ఏడు నుంచి ఎనిమిది మంది దాకా ఉన్నారు. కాలేజీలు విపరీతంగా పెరగడం, స్టూడెంట్స్ సంఖ్య తగ్గడంతో అడ్మిషన్లు ఈసారి బాగా తగ్గాయి. రాష్ట్రంలోని మొత్తం కాలేజీలను పరిగణలోకి తీసుకుంటే ఈ లెక్కన 40 శాతం స్టాఫ్ కు జీతాలు ఆగిపోయాయి. అడ్మిషన్లు రాకపోవడానికి చాలా కారణాలున్నాయని యూటీఎఫ్ తెలిపింది. అధ్యాపకులను బాధ్యులు చేస్తూ జీతాలు ఆపేయడం సరికాదని, సొసైటీ కార్యదర్శి తీరును ఖండిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, జనరల్ సెక్రటరీ చావ రవి అన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.