
Published 28 Nov 2023
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని కార్మికుల(Labour Workers)తో ముఖ్యమంత్రి సమావేశమవుతారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో సింగిల్ పర్మిట్ పాలసీ, చలాన్లలో 50 శాతం మాత్రమే చెల్లించే అవకాశాన్ని కల్పించడంతోపాటు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు రూ.12,000 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లతో జూబ్లీహిల్స్ లో రాహుల్ సమావేశమయ్యారు.
కార్మికుల సాధక బాధకాల ఓపికగా విని.. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ధైర్యాన్నిచ్చారు. రోజూ 11 గంటలు పని చేయిస్తున్నారని, గట్టిగా అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులు తమ బాధల్ని చెప్పుకున్నారు. అతి త్వరలోనే ఈ కష్టాలన్నీ పోతాయని, హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డైరెక్ట్ CMతో మీటింగ్ ఏర్పాటు చేయిస్తానని రాహుల్ వారికి వివరించారు.