ఎప్పుడూ సంచలన వార్తల్లో నిలిచే BJP MLA రాజాసింగ్… రాష్ట్ర మంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి తన్నీరు హరీశ్ రావుతో రాజాసింగ్ స్పెషల్ గా మీట్ అయ్యారు. నియోజకవర్గ డెవలప్ మెంట్ వర్క్స్ కోసమే హరీశ్ ను కలిశానని రాజాసింగ్ చెబుతుండగా.. ఈ విషయం హాట్ టాపిక్ మారింది. దీంతో రాజాసింగ్ BRSలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయనపై కమలం పార్టీ ఏడాది క్రితం వేటు వేసింది. సస్పెన్షన్ రీకాల్ చేసేందుకు రాష్ట్ర టాప్ లీడర్లు, ముఖ్యంగా బండి సంజయ్ ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. సస్పెన్షన్ ఎత్తివేయకపోగా రాజాసింగ్ కు పార్టీలో సరైన ప్రయారిటీ దక్కట్లేదని చాలా రోజులుగా వినిపిస్తున్న టాక్. ఈ పరిణామాల దృష్ట్యా ఆయన మనస్తాపంగా ఉన్నట్లు… అందుకే హరీశ్ రావును కలిసినట్లు ఊహాగానాలు, సోషల్ మీడియాలో ప్రచారాలు నడుస్తున్నాయి.
గతేడాది ఆగస్టులో ఒక మతానికి సంబంధించిన వీడియో(Video)ను రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, దానిపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో BJP హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. లెజిస్లేటివ్ పార్టీ నేతగానూ ఆయన్ను తప్పించింది. రాజాసింగ్ పై సదరు మతానికి చెందిన వ్యక్తులు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో ఆయన్ను అరెస్టు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ PD యాక్ట్ పెట్టి రెండోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. కొద్దిరోజులకు ఆయన విడుదలై బయటకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ తాజాగా హరీశ్ రావుతో మీట్ అవ్వడం సంచలనంగా మారింది. ఆయన త్వరలోనే పార్టీ మారతారా అన్న అనుమానాలు అందరిలోనూ కనిపిస్తున్నాయి.