Published 26 Dec 2023
హైదరాబాద్ పోలీస్ కమిషనర్(CP)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కమిషనరేట్ పరిధిలోని అధికారులపై కొరడా ఝుళిపించడం మొదలైంది. తప్పు చేశారో లేదో తెలుసుకోవడానికి ఎంక్వయిరీ చేయించడం, నిజమని తేలితే వేటు వేయడం రెండే అన్న తీరుగా వ్యవహాహరం తయారైంది. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న కొత్త CP… ఇప్పుడు మరో CIపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ MLA కొడుకు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ పంజాగుట్ట సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పంజాగుట్ట PS పరిధిలోని ప్రజాభవన్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి.. CIపై వేటు వేశారు.
జరిగిన తతంగం ఇది…
మొన్నటివరకు ప్రగతి భవన్ గా ఉన్న తాజా ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బోధన్ మాజీ MLA షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్.. కారు నడిపి ప్రజాభవన్ గేట్లను బద్ధలు కొట్టాడు. ఈ ఘటనలో బారికేడ్లు ధ్వంసమై కారు దెబ్బతినగా నలుగురు పోలీసులకు చిక్కితే అందులో అమ్మాయిలు ఉన్నారు. దాడి జరిగిన ఈ నెల 23న అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదే రాత్రి నిందితుణ్ని పోలీస్ స్టేషన్ కు తరలించగా.. కొద్దిసేపటికే షకీల్ అనుచరులు ఠాణా వద్దకు చేరుకుని సాహిల్ పేరును FIRలో చేర్చొద్దని కోరి అక్కణ్నుంచి అతణ్ని తీసుకెళ్లిపోయారు. నిందితుడి స్థానంలో షకీల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి పేరును FIRలో చేర్చారు.
తీగలాగించిన సీపీ…
ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని CP నుంచే ఆదేశాలు రావడంతో CC ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. జరిగిన తతంగంలో తమ వాళ్ల పాత్రే ఉందని గమనించిన అధికారులు.. CI సహా నైట్ డ్యూటీ SIతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారంపై దర్యాప్తు చేశారు. కారు నడిపింది షకీల్ తనయుడిగా గుర్తించినా తప్పుడు కేసు పెట్టారని గుర్తించిన CP.. సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఇదే తీరులో కారు నడిపి అతడు ఇదే విధంగా వ్యవహరించాడని DCP విజయ్ కుమార్ తెలిపారు. ఈయనపై ఉన్న పాత కేసును తిరగదోడి మళ్లీ దర్యాప్తు చేపడతామని అన్నారు.