మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 11 Jan 2024
ప్రజలన్నాక ఉద్యోగులుంటారు.. వ్యాపారులూ ఉంటారు.. సొంతకాళ్లపై ఆధారపడుతూ మంచి స్థాయిలో ఉన్నవారు లెక్కలోకి వస్తారు. మధ్య, దిగువ స్థాయి ప్రజలకు సరైన ఆదాయం లేనందున పేదవారి(Below Poverty Line-BPL)గా గుర్తిస్తూ వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు పథకాలు(Schemes) అందజేస్తుంటాయి. ఎంత లెక్కేసుకున్నా ప్రతి రాష్ట్రంలోనూ 25 నుంచి 40 శాతం ఇంకా లేదంటే ఓ 50 శాతం పేదలున్నారన్నాకోవచ్చు. 50 శాతం దాటారంటే అది పేద రాష్ట్రంగానే ముద్రవేయాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ, వ్యయాల గురించి పక్కనపెడితే కొత్త రాష్ట్రం మాత్రం ‘సర్ ప్లస్ స్టేట్’గా అందరి ప్రశంసలూ అందుకొంది. మరోవైపు దేశంలోనే ఎకానమీ పరంగా తొమ్మిదో పెద్ద(Largest) రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ప్రభుత్వ పెద్దలు సైతం మాది ధనిక తెలంగాణ అంటూ ఊదరగొట్టారు.
నిజంగా ధనికులే అయితే…
మిగులు బడ్జెట్ గా ముద్రపడ్డ రాష్ట్రం నిజంగా ధనికమైందే అయితే.. స్కీమ్స్ పై ఆధారపడేవాళ్ల సంఖ్య తక్కువుండాలి. కానీ అదేంటో… తెలంగాణ విషయంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. రేషన్ కార్డులు లక్షల్లో ఉంటాయి.. రైతుబంధు నిధులు అందుకునే వాళ్లూ లక్షల్లో ఉంటారు.. ఇతర పథకాలు పొందుతున్నవారూ పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. రాష్ట్రంలో BPL స్థాయి ప్రజలు ఇంత మంది ఉన్నారా.. ఇంతమందికి ఉపాధి కల్పించలేనప్పుడు ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది.. అన్నది ‘క్వశ్చన్ మార్క్’గా తయారైంది. తాజా ప్రజాపాలన దరఖాస్తులు చూసినా అదే అనుకోవాల్సి వస్తున్నది. ఈ సదస్సులకు 1.25 కోట్ల అప్లికేషన్లు వస్తే అందులో అభయహస్తం కింద ఆరు స్కీమ్ లకే 1.05 కోట్లు ఉన్నాయంటేనే ఎంతమంది పేదలున్నారో అర్థం చేసుకోవచ్చు. దీన్నిబట్టి జనాభాను మించిపోయే స్థాయిలో పేదలున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
జనాభాను మించి…
రాష్ట్ర జనాభా 3.95 కోట్లయితే.. ఇంటికి ముగ్గురు అనుకున్నా జనాభాకు సమానంగా అప్లికేషన్లు వచ్చాయి. వాస్తవానికి గతం నుంచే ఇష్టమొచ్చినట్లు లబ్ధిదారులుగా గుర్తించడంతోనే అసలు సమస్య వచ్చి పడింది. 10 ఎకరాలున్న వ్యక్తులు రేషన్ తీసుకుంటున్న పరిస్థితి ఉండగా, ఉన్నతస్థాయి వ్యక్తులు సైతం తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు. జాతీయ ఆహార భద్రత చట్టం(NFSA) కింద 54.39 లక్షలుంటే అందులో 1.94 కోట్ల మంది.. రాష్ట్ర ఆహార భద్రతా కార్డులు 35.59 లక్షలైతే 91.30 లక్షల లబ్ధిదారులున్నారు. ఇలా మొత్తంగా 2.85 కోట్ల మందికి రేషన్ కార్డుల్లో పేర్లుంటే వీరి శాతం 71.5గా ఉంది. ఇక కార్డుల్లో కొత్త పేర్లు చేర్చాలంటూ 11 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటినీ కలిపితే లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లు దాటి బీదలు 75% దాటిపోతున్నారు. కానీ ఇందులో 9.90 లక్షల కార్డుదారులు అసలు రేషనే తీసుకోవడం లేదు. అంటే రేషన్ తీసుకోనివారి శాతం 11గా ఉంది. ఆరోగ్యశ్రీ, ఇతర స్కీమ్ ల కోసమే కార్డులు తీసుకున్నారు.
అసలు పేదలకు అవస్థలే…
ఇప్పటికీ రేషన్ కార్డు లేని పేదల సంఖ్య భారీగా ఉంది. బ్లడ్ కేన్సర్ బారిన పడ్డ భార్య కోసం ఉన్న చిన్నపాటి హోటల్ అమ్ముకుని 6 నెలల నుంచి చిల్లిగవ్వ లేక హైదరాబాద్ హాస్పిటల్ లో నరకయాతన అనుభవిస్తున్న కుటుంబానికి ఇప్పటికీ తెల్ల కార్డు లేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది. పేదలకు కాకుండా అనుకున్నోళ్లకు కార్డులు ఇచ్చారన్న ప్రచారం ఉంది. డబ్బులున్నోళ్లూ రేషన్ కార్డు తీసుకుంటే ‘మా గతి ఏంగావాలి’ అంటూ చాలామంది బాధతో ఉన్నారు. ఏటా రివ్యూ నిర్వహిస్తే పేదలు, అనర్హులు తేలే అవకాశముంటుంది. ఏడాదికేడాది ఆదాయాల్లో మార్పులుంటాయి కాబట్టి నిజమైన పేదల్ని గుర్తించొచ్చు. తినడానికి బుక్కెడు బువ్వకు కూడా నోచుకోని అభాగ్యులున్నంత కాలం ఎంత ధనం ఉన్నా అది ధనిక రాష్ట్రం అనిపించుకోదు. ఇప్పటికైనా రేషన్ కార్డులు, రైతు బంధు వంటి లబ్ధిదారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. అనర్హులను ఏరివేయకపోతే.. పేదలకు న్యాయం జరగడం అటుంచి, ప్రభుత్వాలకు చెడ్డపేరు రావడం మాత్రం ఖాయమని చెప్పాలి.
చాల బాగా రాసావు మామ.స్క్రిప్ట్ nice