నిరుద్యోగులు ఎంతోకాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(DSC)కు రంగం సిద్ధమైంది. పాత నోటిఫికేషన్ కు కొత్త పోస్టులు కలిపి మెగా DSCని నిర్వహించేందుకు విద్యాశాఖ సమాలోచనలు తుది దశ(Final Stage)కు చేరుకున్నాయి. అన్నీ కుదిరితే ఒకట్రెండు రోజుల్లో(ఈనెల 29న ఎక్కువ ఛాన్సెస్)నే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ DSC ప్రకటన వస్తే అందుకు గల షెడ్యూల్(Schedule)ను కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్-1 మాదిరిగానే మరిన్ని పోస్టులు కలిపి కొత్తగా ప్రకటన ఇవ్వబోతున్నారు.
10 రోజుల పాటు పరీక్షలు…
కొత్తగా ప్రకటించబోయే నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈ ఏడాది మే మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 10 రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ జరిపే యోచనలో విద్యాశాఖ కనపడుతున్నది. BRS ప్రభుత్వ హయాంలో గతేడాది 5,089 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే వీటికి మరిన్ని పోస్టుల్ని జత చేసి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ బీఎడ్, డీఎడ్ క్యాండిడేట్స్ గతంలోనే పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. అప్పటి CM కేసీఆర్.. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 పోస్టుల్ని రిక్రూట్ చేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ను ముట్టడించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు.. పోస్టుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంతా కొత్త కొత్తగా…
తాజాగా ఇవ్వబోయే నోటిఫికేషన్(Notification) ద్వారా ఇది మెగా DSCగా ఉండేలా ప్లాన్ తయారు చేశారు. గత ప్రకటనకు 5,973 అదనపు పోస్టుల్ని కలిపి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అంటే గతంలో 5,089 పోస్టులుంటే ఈసారి అంతకన్నా ఎక్కువగా 5,973 పోస్టుల్ని జత చేసి మొత్తంగా 11,062 ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వబోతున్నారు. ఇందుకోసం పాత నోటిఫికేషన్ ను పూర్తి రద్దు చేసి తాజాగా ప్రకటన ఇస్తారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వెసులుబాటు కల్పించేలా చర్యలు ఉండబోతున్నాయి. ఇందుకోసం పాత అప్లికేషన్లను పరిశీలించేందుకు గాను ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించే పనిలో విద్యాశాఖ అధికారులున్నారు.