గ్రామ పంచాయతీ ఎన్నికల(Elections)కు అడుగులు ముందుకు పడుతున్నాయి. మరో 45 రోజుల్లో నోటిఫికేషన్(Notification) వచ్చే అవకాశం ఉండగా, ఫిబ్రవరి మధ్యలో ఎలక్షన్లు నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీంతో స్థానిక సంస్థల సమరంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రానుండగా, షెడ్యూల్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లే ఉంది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ముగ్గురు పిల్లల నిబంధనపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉండగా, రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల లిస్టు తయారైంది. కులగణన సర్వే కూడా ఫైనల్ స్టేజ్ లో ఉండటంతో అది పూర్తయ్యాక రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికగా పరిగణలోకి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.