ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. వచ్చే నెల రోజుల్లోపు ప్రక్రియంతా పూర్తి కావాలని ఆదేశించింది. సెప్టెంబరు 3న మొదలుపెట్టి అక్టోబరు 3 వరకు మొత్తం ప్రక్రియంతా కంప్లీట్ చేయాలని విద్యాశాఖకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఈ రెండ్రోజుల్లోనే రిలీజ్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోర్టు తీర్పునకు లోబడి ఈ కార్యక్రమం సాగాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. పారదర్శకతతో బదిలీలు, ప్రమోషన్లు జరిగేలా చూడాలని, ఇందుకు గాను గైడ్ లైన్స్ ను వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. ఆన్ లైన్ విధానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే సర్కారుకు చెడ్డపేరు వస్తుందని ఆమె గట్టిగా చెప్పారు.
ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ కు సంబంధించి ప్రభుత్వం ఈ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. స్పౌస్ కేటగిరితోపాటు యూనియన్ల ఆఫీస్ బేరర్లకు 10 పాయింట్లు ఇవ్వడంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం బదిలీలు, ప్రమోషన్లకు హైకోర్టు బుధవారం(ఈ ఆగస్టు 30న) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్స్ కోసం 73,803 మంది అప్లయ్ చేసుకున్నారు.