Published 05 Dec 2023
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరే సమయం వచ్చేసింది. నిన్నటి నుంచి వెలువడుతున్న ఊహాగానాలకు తెరదించుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ప్రకారం ఈనెల 7 నాడే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా(Third Chief Minister), ఆ పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా ఎ.రేవంత్ రెడ్డి నిలవనున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలిచ్చింది. నిన్న CLPలో జరిగిన పరిణామాలతో రాజకీయం ఒక్కసారిగా గరం గరంగా మారిన పరిస్థితుల్లో మంగళవారం పొద్దున ఉత్తమ్ తోపాటు భట్టిని ఢిల్లీ పిలిపించుకున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు రాహుల్, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే సహా అగ్ర నేతలంతా ఖర్గేతో చర్చలు జరిపారు. రేవంత్ అభ్యర్థిత్వానికి రాహుల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది.
హైదరాబాద్ లో అనుకున్నా చివరకు అక్కడే
ఢిల్లీలోనే శివకుమార్ తో కలిసి మీడియా సమావేశం పెట్టిన కేసీ వేణుగోపాల్.. తదుపరి CM రేవంతేనని పూర్తి క్లారిటీ ఇచ్చారు. డీకే శివకుమార్ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడే ప్రకటిస్తారని అనుకున్నా దానికి భిన్నంగా ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. అటు వేణుగోపాల్ సైతం CM పేరును ప్రకటించడం, ఈలోపు హస్తినకు రావాలని కాబోయే సీఎంకు మెసేజ్ రావడంతో రేవంత్ వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే చీఫ్ మినిస్టర్ అర్హతలున్న వ్యక్తిని తాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 7 సార్లు పోటీ చేసి గెలుపొందానని, తనకన్నా అర్హులు ఇంకెవరుంటారని ఉత్తమ్ ప్రశ్నించారు. హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక రేపటి ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లయింది.