భూమిలో విపరీతంగా జరుపుతున్న తవ్వకాల(Mining) వల్లే భూకంపాలు వస్తుంటాయా.. ఎక్కడికక్కడ మైనింగ్ కోసం తవ్వుతూ తిరిగి వాటిని పూడ్చటం ద్వారా ప్లేట్లలో కదలికలు వస్తుంటాయని భావిస్తుంటాం కదా..! కానీ భూకంపాలకు మైనింగ్ తో సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రకంపనలు వాటివే అని అనుకుంటున్నారు చాలామంది. అయితే బొగ్గు తవ్వకాలు లేదంటే ఇతర మైనింగ్ కార్యకలాపాల వల్ల భూకంపాలు రావట.
తవ్వకాలనేవి కేవలం కొన్ని మీటర్ల వరకు ఉంటాయి కానీ కిలోమీటర్ల లోతుకు వెళ్లి ఆ పని చేయరు. అందుకే మైనింగ్ వల్లే ఇవన్నీ అన్న ప్రచారం అపోహ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రకంపనలు(Vibrations) ములుగు జిల్లా మేడారం ప్రాంతంలోని 10 కిలోమీటర్ల లోతు నుంచి ఏర్పడ్డవని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇలా 10 కిలోమీటర్ల లోతు నుంచి వచ్చిన ప్రకంపనలు చుట్టూ 200 నుంచి 300 కిలోమీటర్ల మేర వ్యాపిస్తాయని, ఈరోజు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో అలాంటి సిట్యుయేషన్సే కనిపించాయంటున్నారు. ఆ స్థాయి లోతులో ఏర్పడటం వల్లే ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపలేదన్నారు.