మీ వెంట డబ్బు తీసుకెళ్తున్నారా.. నగదు లేదంటే బంగారం, వెండిని దగ్గర పెట్టుకుంటున్నారా.. అయితే ఇది పరిమితి దాటితే లెక్కలు చూపాల్సిందే మరి. మామూలు సమయాల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోరు కాని ఎన్నికల టైమ్ లో మాత్రం జాగ్రత్త(Alert)గా ఉండాల్సిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి దానికీ లెక్కలు చూపాల్సిందే అంటున్నారు అధికారులు. జేబులో రూ.50,000కు మించి కలిగి పోలీసులు గుర్తిస్తే మాత్రం సీజ్ చేసే అధికారం వారికి ఉంటుంది. అందుకే తీసుకెళ్లే డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపాల్సి ఉంటుంది. బంగారం, వెండికి అయితే రసీదులు తప్పనిసరి. మీరు నగదు, పసిడి, వెండి తరలిస్తున్న సమయంలో పోలీసులు చెక్ చేసినట్లయితే వాటికి సంబంధించిన రసీదుల్ని చూపాలి. మీరు చెప్పేదాంట్లో ఏదైనా అనుమానం ఉందని భావిస్తే వెంటనే వాటిని స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా సంబంధిత ఆధారాలు కచ్చితంగా చూపిస్తేనే తిరిగి వాటిని అందజేస్తారు. లేదంటే ఇక ఆ సొమ్ము గోవిందే. చివరకు హాస్పిటల్ బిల్లు కోసం తీసుకెళ్లే డబ్బుకు కూడా రసీదు(Receipt) చూపాలన్నది ఎన్నికల నిబంధన.
అవగాహన లేకనే ఇరకాటంలో
రాజకీయ పార్టీల సంగతి అటుంచితే ‘ఎన్నికల కోడ్’ గురించి అవగాహన లేక పోవడం వల్లే చాలా మంది సొమ్మును పోగొట్టుకుంటున్నారు. బైక్ లు, కార్లలో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా సొమ్ము పట్టుబడుతున్నది. అయితే ఇందులో వివిధ అవసరాల కోసం తరలించే సామాన్యులు ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టని అధికారులు.. రసీదులు అందజేస్తే చాలు చూసి వదిలేస్తున్నారు. ఆ… ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో ఉంటే మాత్రం చేతిలో ఉన్న డబ్బు, బంగారం, వెండి ఇలా ఏదైనా కోల్పోక తప్పదు