అన్నాచెల్లెళ్ల అనుబంధాలు, ఆప్యాయతలు ఆర్టీసీకీ బంధంగా మారుతున్నాయి. ఏ పండుగకూ లేని విధంగా ఈ ఒక్కరోజే సంస్థకు కోట్లల్లో ఆదాయం వస్తోంది. ఏటికేడు ఈ ఆదాయం(Revenue) పెరుగుతూనే ఉంది. గత ఏడాది కంటే ఈ సారి రూ.కోటి ఎక్కువగా లభించింది. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వచ్చే ఆదాయంలో ఆర్టీసీ గణనీయంగా మెరుగుపడింది. రాఖీపౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఇది ఒకరోజులో RTCకి వచ్చిన ఆల్ టైమ్ రికార్డుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న(ఆగస్టు 31నాడు) రూ.22.65 కోట్లు రాగా.. ఇది గత రాఖీ పౌర్ణమి(12-08-2022) నాడు రూ.21.66 కోట్లుగా ఉంది. ఈసారి ఏకంగా కోటి రూపాయలు ఎక్కువగా రావడంతో అధికారుల్లో సంతోషం కనపడుతోంది. నిన్న ఒక్కరోజే 40.92 లక్షల మంది బస్సుల్లో జర్నీ చేశారని, ఇది కూడా గతేడాది కన్నా లక్ష అధికంగా నిలవడం సంస్థ డెవలప్ మెంట్ ను తెలియజేస్తోంది. మరోవైపు గతేడాది కన్నా ఈసారి 1.23 లక్షల కిలోమీటర్లు ఎక్కువగా బస్సులు నడిచాయి. పోయిన రాఖీ పండుగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఈసారి 36.77 లక్షల కిలోమీటర్లు నడిచాయి.
20 డిపోల్లో వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ
ఆక్యుపెన్సీ రేషియో పరంగా చూస్తే 20 డిపోల్లో 100 శాతానికి పైగా OR నమోదైంది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లా 104.68 శాతంతో టాప్ లో నిలవగా.. ఆ జిల్లా పరిధిలోని నార్కట్ పల్లి మినహా మిగతా 7 డిపోలు 100 శాతానికి పైగా OR సాధించాయి. నల్గొండ తర్వాత స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నిలవగా.. అక్కడ 9 డిపోలకు గాను 6 డిపోలు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ సాధించాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో 90 శాతానికి పైగా OR రికార్డయింది. హుజూరాబాద్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి, పరకాల, జనగామ, తొర్రూర్, మహబూబాబాద్, నర్సంపేట, హుస్నాబాద్, కల్వకుర్తి, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో సాధించినట్లు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, MD వీసీ సజ్జనార్ తెలిపారు.