ఎండలు మండిపోతున్న వేళ కరెంటు వినియోగం(Consumption) భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీలకు చేరుకోవడంతో రికార్డు స్థాయిలో కరెంటును వాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్(GHMC) పరిధిలో ఈ ఒక్కరోజే సరికొత్త రికార్డు నమోదైంది. గురువారం మధ్యాహ్నం 4,053 మెగావాట్ల విద్యుత్తును వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా కరెంట్ సప్లయ్ చేశామన్నారు. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే ఈసారి 582 మెగావాట్ల అధిక కరెంటు వినియోగమైంది. 2023 ఏప్రిల్ 18న 3,471 మెగావాట్లు వాడితే ఇప్పుడది 4 వేల మెగావాట్లను దాటింది.
ఎలాంటి అంతరాయాలు(Powercuts) లేకుండా అన్ని కేటగిరీలకు నిరంతర కరెంటు సప్లయ్ చేస్తున్న విద్యుత్ శాఖను డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. రాబోయే నెలలో ఈ రికార్డు కూడా దాటిపోయే ఛాన్స్ ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.