
రాష్ట్రంలో వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గేటట్లు కనపడటం లేదు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెండ్రోజుల పాటు ‘రెడ్ అలర్ట్'(Red Alert) జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని, ఆయా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలంటూ ‘రెడ్ అలర్ట్’… ప్రకటించింది. ఈరోజు ఉదయం నుంచి రేపు పొద్దున వరకు ఈ పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. ఈనెల 26 ఉదయం 8:30 నుంచి 27 పొద్దున 8:30 గంటల దాకా 7 జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట జిల్లాలకూ ‘రెడ్ అలర్ట్’ ఇష్యూ అయింది.
రేపు హైదరాబాద్ కు ‘రెడ్ అలర్ట్’
ఇప్పటికే కంటిన్యూ వానలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ కు ‘రెడ్ అలర్ట్’ జారీ అయింది. వానలు ఇంకా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించడంతో నగరంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. రేపు ఉదయం నుంచి ఎల్లుండి పొద్దున వరకు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని, GHMC జాగ్రత్తలు తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది.