
నామినేటెడ్ కోటా కింద ప్రభుత్వం పంపిన రెండు పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ తిరస్కరించారు. రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రిజెక్ట్ చేస్తూ CM కేసీఆర్ తోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)కి లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక, సహకార ఉద్యమం, సోషల్ సర్వీసులో ప్రత్యేక అనుభవం, పరిజ్ఞానం ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలన్నారు. ఎవరిని ఎంపిక చేయరాదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా తెలియజేశారని గవర్నర్ గుర్తు చేశారు. రాజకీయాలు, కార్పొరేట్, విద్య వ్యవహారాల్లో దాసోజు శ్రవణ్.. రాజకీయాలు, కార్మిక సంఘాల వంటి రంగాల్లో సత్యనారాయణ క్రియాశీలంగా ఉన్నారని, వీరికి ఆర్టికల్ 171 కింద పేర్కొన్న అంశాలపై అవగాహన లేదని తమిళిసై తెలిపారు. వీరిద్దరికీ సామాజిక సేవలో ఎలాంటి అర్హతలు లేవంటూ MLCగా పేర్లను తిరస్కరించారు.
మండిపడ్డ మంత్రులు
గవర్నర్ చర్యపై రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… తీవ్రంగా మండిపడ్డారు. తమిళిసైకి నైతికత లేదని, నిబంధనలు తుంగలో తొక్కి ఆమెను గవర్నర్ చేశారన్నారు. అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం విమర్శలు చేశారు.
బాధ్యతగా వ్యవహరించారన్న కిషన్ రెడ్డి
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆమె పూర్తి బాధ్యతతో వ్యవహరించే MLC పేర్లను తిరస్కరించారని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సమాజానికి సేవ చేసేవారికే తప్ప కేసీఆర్ కుటుంబానికి సర్వీసు చేసేవారికి కాదంటూ విమర్శలు చేశారు.