రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. మంత్రి కేసు వివాదంపై తీర్పును కోర్టు వెలువరించింది. ఆయన ఎన్నిక చెల్లదన్న పిటిషన్(Petition) ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ వేశారు. ఈ కేసు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. మంత్రి విషయంలో ఉదాసీనత చూపిస్తున్నారంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు తొలుత.. మహబూబ్ నగర్ పోలీసులకు షాకిచ్చింది. కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో కేంద్ర ఎన్నికల సంఘం సహా 11 మందిపై కేసు ఫైల్ అయింది. దీనిపై CEC, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడ్డారు.
గైడ్ లైన్స్ ప్రకారం 4 సార్లు మార్చొచ్చన్న లాయర్
తొలుత నవంబరు 14వ తేదీన ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయగా.. దాన్ని మారుస్తూ మరోసారి నవంబరు 19న మహబూబ్ నగర్ MLA శ్రీనివాస్ గౌడ్ మరో అఫిడవిట్ దాఖలు చేయడంతో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలం ఇరుపక్షాల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. నిబంధనలకు అనుగుణంగా పిటిషన్ మార్చామని, గైడ్ లైన్స్ ప్రకారం నాలుగు అఫిడవిట్లు దాఖలు చేసే అవకాశముంటుందని మంత్రి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మొదటి అఫిడవిట్ లో లేనివి సెకండ్ అఫిడవిట్ లో చూపించారని రాఘవేందర్ రాజు తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు వెలువరించింది.