రాష్ట్రానికి ప్రతి నెలా వచ్చే ఆదాయం(Revenue)లో రెండు వంతుల మేర అప్పులు, జీతాలకే వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. ఈ ఆదాయం అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. ప్రతి నెలా వచ్చే రాబడి రూ.18,500 కోట్లయితే.. అందులో రూ.6,500 అప్పులకు, మరో రూ.6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు వెచ్చిస్తున్నారు. ప్రతి కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలంటే రూ.30 వేల కోట్లు కావాల్సి ఉండగా.. అందులో సగానికి కన్నా కొద్దిగా ఎక్కువ మాత్రమే వస్తోంది. కనీస అవసరాల(Minimum Needs)కు రూ.22,500 కోట్లు కావాల్సి ఉండగా ఇప్పుడు రూ.18,500 కోట్లే రావడంతో నెల నెలా రూ.4 వేల కోట్లు తక్కువవుతున్నట్లు CM వివరించారు.
ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే మరింత సమయం పడుతుందంటూ సమస్యల పరిష్కారానికి ధర్నాలే చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాల్ని ప్రేరేపిస్తున్నారని, ఆ మాయలో పడొద్దని హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా అది సాధ్యం కాదని రేవంత్ అన్నారు. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీం కాబట్టి ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని, అలా చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.