Published 05 Dec 2023
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి.. CLP నేతగా ఎన్నికవడానికి నిన్నటి నుంచి హైడ్రామాను ఎదుర్కొన్నారు. చివరకు రాహుల్ గాంధీయే జోక్యం చేసుకుని ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో అనుమానాలన్నీ వీగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో హుటాహుటిన ఢిల్లీకి రావాలని పిలుపు రావడంతో రాత్రికి వెంటనే హస్తినకు బయల్దేరి వెళ్లిపోయారు. పూర్తి భావోద్వేగం కూడిన సందర్భంలో వెళ్తూ వెళ్తూ అధిష్ఠానాన్ని, కార్యకర్తలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో హైకమాండ్ పెద్దల్ని కలుసుకుని ధన్యావాదాలు తెలపనున్న రేవంత్ అంతకు ముందుగా ట్వీట్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పేరుపేరునా కృతజ్ఞతలు
తెలంగాణ కలను సాకారం చేసిన సోనియమ్మ, స్ఫూర్తి ప్రదాత రాహుల్ గాంధీ, ఛరిష్మా గల ప్రియాంక గాంధీ, AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి(General Secretary) కె.సి.వేణుగోపాల్, కర్ణాటక డిప్యుటీ CM డి.కె.శివకుమార్ అని సంబోధిస్తూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అటు తనకు పూర్తి స్థాయిలో ముందునుంచీ ఇప్పటిదాకా అండగా నిలిచిన శ్రేణులను కాంగ్రెస్ సైనికులుగా ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. మీ అందరి అండ వల్లే ఈ స్థాయికి ఎదిగానన్న మాటలు ఆయన మెసేజ్ లో కనిపించాయి.