Published 14 Dec 2023
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని బయటపెట్టకుండా నిజాలు దాస్తే నిష్క్రమణ తప్పదని మంత్రులు తీవ్రస్థాయిలో అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టుల నిర్మాణాలపై సమీక్ష సాగింది. నీటిపారుదల శాఖ(Irrigation Department) అధికారులు, ఇంజినీర్లపై మంత్రుల బృందం తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రాజెక్టుల అంచనాలు ఇష్టమొచ్చిన రీతిలో పెంచి ప్రజాధనాన్ని పెద్దయెత్తున దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆయకట్టు పెంచకుండా అంచనాల పెంపు ఎలా…
అసలు ఆయకట్టునే పెంచకుండాvs అంచనాలు ఎలా పెంచుతారని ప్రశ్నించిన డిప్యుటీ CM బృందం.. అధికారులు నిజాలు దాచిపెట్టకుండా వాస్తవాలు బయటకు చెప్పాలని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.2,400 కోట్లతో చేపడితే దాన్ని రీ-డిజైనింగ్ పేరిట రూ.13,000 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నలు వేశారు. మీ వ్యవహారశైలి చూస్తే గత పదేళ్లలో ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లిచ్చారా అని మండిపడ్డారు.