ఆరు గ్యారంటీల్లో భాగమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కారు సమాలోచనలు మొదలుపెట్టింది. ప్రతి సెగ్మెంట్లో నిర్మించబోయే 3,500 ఇళ్లపై డిప్యూటీ CM భట్టి విక్రమార్క.. హౌజింగ్ మంత్రి పొంగులేటితో కలిసి రివ్యూ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ల నమూనా(Designs)లు, లబ్ధిదారుల(Beneficieries) ఎంపికపై ఆయా రాష్ట్రాలకు అధికారుల్ని పంపించి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు.
గ్రీన్ ఎనర్జీలో…
కాలుష్యరహితమైన గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ప్రతి ఇందిరమ్మ ఇంటికి సోలార్ విద్యుత్తు ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. నిర్మాణ సమయంలోనే సోలార్ విద్యుత్తు ఉండేలా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు టీంలుగా ఏర్పడి చెన్నై, బెంగళూరు, ముంబయికి వెళ్లి సమగ్ర అధ్యయనం చేస్తారని పొంగులేటి వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్(ORR), రీజినల్ రింగ్ రోడ్(RRR) చుట్టూ ఇళ్లు ఉండేలా చూడాలన్న మంత్రులు.. ఎస్సార్ నగర్, బర్కత్ పుర, కూకట్ పల్లి, ECIL వంటి ప్రాంతాల్లో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో గతంలో LIG, MIG, HIG పేరిట నివాసాలు ఏర్పాటు చేయడంతో ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరిందని మంత్రులు గుర్తు చేశారు.