
Published 12 Nov 2023
పరీక్షలు నిర్వహించలేక అభాసుపాలు, లీకేజీలతో నవ్వుల పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) భవితవ్యం నేడు తేలిపోనుంది. ఇప్పటికే ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి ఔట్ కాగా.. ఇప్పుడిక మిగతా కమిషన్ సభ్యుల వంతు. పరీక్షల నోటిఫికేషన్, నిర్వహణ తీరుపై 11 నెలల కాలంగా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుని చివరకు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అంగీకరించిన కమిషన్.. గ్రూప్-1 ప్రిలిమినరీతోపాటు, AEE, AE, DAO(Divisional Accounts Officers) ఎగ్జామ్స్ ను రద్దు చేసింది. అటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(TPBO), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీల్ని మార్చింది. లీకేజీలపై గత ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహిస్తే పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని లీక్ చేసింది నిజమేనని నిర్ధారణైంది. ఈ పేపర్స్ ను కొన్న 100 మందిని రిమాండ్ కు తరలించడంతోపాటు వారు ఇక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముందు నుంచీ TSPSCని ప్రక్షాళన చేస్తామని చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగానే నిన్న తన వద్దకు వచ్చిన వెంటనే కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి పదవిని విడిచిపెట్టారు. కమిషన్ భవితవ్యంపై CM రేవంత్ ఈ రోజు రివ్యూ చేపడుతుండగా గ్రూప్-1 లీకేజీ, గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ ను చర్చించబోతున్నారు. వీటితోపాటు వాయిదా పడ్డ, రద్దయిన వాటి గురించి పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఏం చేయాలనే దానిపై యంత్రాంగంతో చర్చించనున్నారు. కమిషన్ ఛైర్మన్ రాజీనామా దృష్ట్యా మిగతా సభ్యులు సైతం అదే బాట పట్టనున్నట్లు అక్కడి పరిణామాలు చూస్తే అర్థమవుతున్నది. రేవంత్ కూడా దీనిపై సీరియస్ గా ఉండటంతో TSPSC భవితవ్యం ఎలా ఉండనుందన్నది చర్చనీయాంశంగా మారింది.