రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(RTC)లో వేతన సవరణ నిరాకరణ వల్ల 54,000 మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర్ రావు అన్నారు. సర్వీసులో ఉన్న 43,000 మందితోపాటు పదవీ విరమణ పొందిన మరో 11,000 మంది దీని వల్ల తీవ్రంగా నష్టపోతారని గుర్తు చేశారు. వేతన సవరణ నిరాకరణతో 100 శాతం D.A.మెర్జర్, ఫిట్ మెంట్ కోల్పోవడం ద్వారా బేసిక్ పెరుగుదల లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1, 2017 నాటికి 54 వేల మంది ఉద్యోగులు ఉండగా.. ఆగస్టు 30, 2023 వరకు వారి సంఖ్య 43 వేలకు చేరకుందని, ఇప్పుడీ వేతన సవరణ నిరాకరణతో వీరంతా నష్టపోతారన్నారు.
అన్నింటినీ కోల్పోవడమే
బేసిక్ పెంపు లేకపోవడం వల్ల పలు రకాలుగా D.A., HRA, PF, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, CCA వంటివి నష్టపోవాల్సి వస్తున్నదన్నారు. ఈ సమస్యలను అర్థం చేసుకుని చట్టబద్ధమైన అగ్రిమెంట్ ను గౌరవిస్తూ, తక్షణం వేతన సవరణ అమలు చేయాలని నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. వేతన సవరణ అమలుతోపాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఇకనైనా విడుదల చేయాలన్నారు.