అక్రమంగా రైతుబంధు తీసుకున్న వారి నుంచి రికవరీ(Recovery) చేస్తారా.. ఇది సాధ్యమయ్యే పనేనా.. బడా బాబుల సంగతేంటి.. అన్న చర్చ జోరందుకుంది. రైతుబంధు అమలు తీరుపై విచారణ కమిషన్లతోపాటు అనర్హుల నుంచి వెనక్కు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయేతర భూమికి రైతుబంధు పొందిన వ్యక్తితోపాటు అక్రమంగా పింఛను పొందిన వృద్ధురాలికి నోటీసులు పంపడం సంచలనంగా మారింది.
ఇలా జరిగింది…
ఘట్ కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి.. 30 ఎకరాల భూమికి రూ.16.80 లక్షలు తీసుకోగా.. రెవెన్యూ అధికారుల విచారణతో రికవరీ యాక్ట్ కింద నోటీసులిచ్చారు. మొత్తంగా 12 విడతల్లో సాగిన పంపిణీ ద్వారా రూ.80,458 కోట్లు పంచితే.. సాగులో లేని భూములు, కొండలు, రోడ్లు, లేఔట్ల పేరిట రూ.25,672 కోట్లు పక్కదారి పట్టాయని సర్కారు గుర్తించింది. బడా రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, MPలు, MLAలు అందులో ఉన్నారు.
పింఛను సైతం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల వృద్ధ మహిళ ఇప్పటిదాకా రూ.1,72,928 అందుకున్నారు. ఆమెకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై KTR విమర్శలు చేస్తే.. సర్కారు ఎదురుదాడికి దిగింది. నిజానికి సదరు వృద్ధురాలి కుమార్తె ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా ఉంటూ మరణించారు. దీంతో అటు డిపెండెంట్ పెన్షన్ ఇచు వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్నారని అందుకే రికవరీ నోటీసులు ఇచ్చామని చెప్పింది.
లెక్క తెగుతుందా…
అనర్హుల నుంచి రికవరీ ప్రక్రియ అంత సులభం(Easy) కాదన్న మాటలున్నాయి. గిట్టని వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడం వల్ల ప్రజల మధ్య మనస్పర్థలు వచ్చే ప్రమాదముందంటున్నారు. రికవరీ అనేది సామాన్యులకేనా లేకా అందరికీ ఉంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రైతుబంధే కాకుండా మిగతా బంధులు, గొర్రెల స్కీమ్, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్స్ వంటి స్కీముల్లోనూ అనర్హుల్ని గుర్తిస్తారా అన్నది ప్రధాన చర్చగా మారింది. రేషన్ కార్డుల్లోనూ లక్షల్లో అక్రమార్కులున్నారు. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా ప్రభుత్వం చేపట్టిన చర్య మంచిదేనంటూ మరికొంతమంది అంటున్నారు.