Published 07 Dec 2023
ఇప్పుడే పాలనా పగ్గాలు చేపట్టాం.. కుదురుకోవడానికి కాస్త సమయమివ్వండి.. రేపు జరిగే మీటింగ్ ను వాయిదా వేయండంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రేపు జరగాల్సిన సమావేశాన్ని జనవరికి వాయిదా వేయాలని తెలిపింది. నాగార్జునసాగర్ వివాదంపై కేంద్ర జల్ శక్తి శాఖ ఈ భేటీని ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దీనిపై కొత్త సర్కారుకు పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. గత నెల 30న పోలింగ్ జరుగుతున్న సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై పెద్ద యుద్ధమే జరిగింది. తెలంగాణ గేట్ లోకి బలవంతంగా ప్రవేశించిన అక్కడి పోలీసులు.. డ్యామ్ మధ్యలో ఫెన్సింగ్ వేసుకున్నారు. అంతేకాకుండా తమ వైపు గల కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేసుకున్నారు.
ఈ పరిణామాలపై చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కేంద్ర జల్ శక్తి శాఖకు, సీడబ్ల్యూసీ(Central Water Commission)కు ఫిర్యాదు చేశారు. AP దాడి నిజమేనని గుర్తించిన కేంద్రం.. పూర్వ స్థితిని కొనసాగించాలంటూ ఇరు రాష్ట్రాల సీఎస్ లకు వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా.. డ్యాంపై CRPF బలగాలను మోహరించి పూర్తి కంట్రోల్ లోకి తీసుకున్నారు. వాస్తవానికి APకి మూడు ఫేజ్ లుగా 15 TMCల నీటిని ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 5 TMCలు వాడుకున్నారు. జనవరిలో 5, ఏప్రిల్ లో మరో 5 TMCలు కేటాయించాల్సి ఉంది. కానీ ఇంతలోనే గొడవ జరగడం, కేంద్రం జోక్యం చేసుకోవడంతో రెండు రాష్ట్రాలతో శుక్రవారం భేటీ జరగాల్సి ఉంది.