ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. నెలరోజుల్లోపు కార్యాచరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో విద్యాశాఖ.. షెడ్యూల్ ను ఖరారు చేసి ప్రభుత్వానికి పంపింది. సెప్టెంబరు 3న ప్రారంభమయ్యే ప్రక్రియ అక్టోబరు మూడో వారం వరకు కొనసాగనుంది. ఎలాంటి గందరగోళం లేకుండా షెడ్యూల్ రూపొందించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఆ దిశగా పలు తేదీల్లో వెబ్ ఆప్షన్లు, బదిలీలు, ప్రమోషన్లతో కూడిన షెడ్యూల్ కు అధికారులు రూపకల్పన చేశారు. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్(Online) అప్లికేషన్లు స్వీకరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సీనియారిటీ లిస్ట్ పై 8, 9 తేదీల్లో అందరి నుంచి అభ్యంతరాలు తీసుకుంటారు. ఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెడ్ మాస్టర్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వనుండగా.. 15న గ్రేడ్-2 హెడ్ మాస్టర్ల బదిలీలు ఉండనున్నాయి.
ఇక ఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చేలా కార్యాచరణ తయారు చేశారు. 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇస్తుండగా.. 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు ఉంటాయి. ఈ నెల 26 నుంచి 28 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT)కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. తర్వాత రోజు నుంచి అంటే 29వ తేదీ నుంచి అక్టోబరు 1 వరకు SGTల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇస్తారు. అక్టోబరు 3న SGTల ట్రాన్స్ ఫర్స్ ఉంటాయి. అక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పీళ్లు చేసుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పిస్తోంది.
టీచర్ల ట్రాన్స్ ఫర్లకు రెండు రోజుల క్రితం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీనిపై ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యం చేయరాదని సర్కారు డిసైడ్ అయింది. పలువురు వేసిన పిటిషన్లతో ఇప్పటికే కావాలని ఆలస్యం జరుగుతోందన్న అపవాదు టీచర్ల యూనియన్లలో ఏర్పడింది. బదిలీలు, ట్రాన్స్ ఫర్లపై విధించిన స్టేను ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రెండు సార్లు కోర్టును అభ్యర్థించారు. అయితే స్పౌస్ కోటాకు 10 పాయింట్లు కేటాయించడాన్ని సమ్మతించిన కోర్టు.. యూనియన్ ఆఫీస్ బేరర్లకు సైతం పాయింట్లు ఇవ్వడాన్ని నిరాకరించింది. కేవలం దంపతుల కోటాకు మాత్రమే పాయింట్లను అమలు చేస్తూ ట్రాన్స్ ఫర్స్ ఉండాలని చెప్పడంతో ఆ దిశగా సర్కారు.. విద్యాశాఖకు కీలక సూచనలు చేసింది. నెల రోజుల్లోపు ఈ కార్యక్రమమంతా పూర్తి కావాలని మంత్రి సబిత ఆదేశించడంతో.. ఆ దిశగా షెడ్యూల్ రిలీజ్ అయింది.