Published 26 Jan 2024
పేద పిల్లలకు విద్యాభాండాగారాలుగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలల(Govt Schools)ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేస్తున్నది. సరైన మౌలిక సదుపాయాలు(Infrastructures) కల్పిస్తే సర్కారు బడి పిల్లల కన్నా మించినవారు లేరన్న కోణంలో.. వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న భావనతో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ బ్యాగ్, టై, బెల్ట్, బూట్లు, సాక్స్ ల్ని సమగ్ర శిక్షా అభియాన్(SSA) ద్వారా అందేజయాలన్నది పాఠశాల విద్యాశాఖ ఆలోచనగా ఉంది. వచ్చే నెలలో జరిగే SSA సమావేశంలో కేంద్ర విద్యాశాఖకు దీనిపై ప్రతిపాదనలు పంపే అవకాశమున్నట్లు ఆ విభాగం వర్గాలు అంటున్నాయి.
కేంద్ర, రాష్ట్ర నిధులతో…
రాష్ట్రంలోని బడి పిల్లలందరికీ ఈ సామగ్రి అందజేయాలంటే ఏటా రూ.300 కోట్ల దాకా అవుతుందన్న అంచనాలున్నాయి. త్వరలో జరగబోయే సమావేశంలో దీన్ని కేంద్రం ఆమోదిస్తే గనుక మోదీ సర్కారు 60 శాతం ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశంలో ప్రతిపాదనల్ని ఉంచే ముందు తొలుత రేవంత్ సర్కారు దీనికి ఆమోదముద్ర(Green Signal) వేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సంతకంతో కూడిన లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
చెప్పులు లేకుండా దీనగాథ…
రాష్ట్రంలో చాలా మంది పిల్లలు చెప్పులు లేకుండానే బడికి వచ్చే దీనావస్థను చూసే విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ స్కీమ్ అమలైతే గనుక 26,000 స్కూళ్లల్లో 25 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. మరి… అసలే అప్పుల కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఈ సాహసం చేస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్ గా తయారైంది. ఈ విషయంలో కేంద్రం స్పందించకుంటే మొత్తం ఖర్చును రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ ఈనెల 27న ఆర్థికశాఖ(Finance Department) నిర్వహించే విద్యాశాఖ బడ్జెట్ రివ్యూపైనే ఆధారపడి ఉండనుంది.