రాష్ట్రంలో ఈనెల 29, 30 తేదీల్లో బడుల(Schools)కు ఎన్నికల సంఘం(Election Commission) సెలవులను ప్రకటించింది. పోలింగ్ ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గల లక్ష మందికి పైగా ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పోలింగ్ నిర్వహించే పాఠశాలల్లో 29 నాడే సిబ్బంది చేరుకోవాల్సి ఉంటుంది. 29వ తేదీన పొద్దున 7 గంటలకు EVMలను తీసుకెళ్లినప్పటి నుంచి 30న రాత్రి వాటిని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే వరకు ఉపాధ్యాయులంతా ఎన్నికల విధుల్లోనే ఉండాలి. అయితే డిసెంబరు 1 నాడు కూడా సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఉపాధ్యాయుల సంఘాల నేతలు కోరారు.
EVMలను అప్పగించి తిరిగి వచ్చేసరికి అర్థరాత్రో, తెల్లారో అవుతుందని అందుకే మరుసటి రోజైన డిసెంబరు 1నాడు కూడా హాలిడే ప్రకటించాలని కోరారు. రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ తోపాటు తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్(TMSTA) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు తదితరులు ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి సెలవు ప్రకటించాలని కోరారు.