ఒకసారి నిర్లక్ష్యం జరిగిందంటే సరిదిద్దుకోవాలి.. కానీ మరోసారి అలాగే జరిగితే ఏమనాలి.. అచ్చంగా నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(High School)లో అదే జరిగింది. భోజనం వికటించి అనారోగ్యం పాలై వారం గడవకముందే రెండోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం భోజనం(Lunch) పూర్తయ్యాక విద్యార్థులకు వాంతులు, విరేచనాలతోపాటు తల, కడుపు నొప్పి మొదలయ్యాయి. వెంటనే 35 మందిని ఆసుపత్రికి తరలించి వైద్యమందిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నమే తహసీల్దార్ సహా అధికారులు పదార్థాల్ని పరిశీలించడమే కాకుండా అక్కడే భోజనం చేసి వెళ్లిపోయారు. ఇది జరిగిన కాసేపటికే పరిస్థితి చేయిదాటిపోయింది.
ఈ నెల 20 నాడు సైతం భోజనం వికటించి 50 మంది పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. స్థానిక P.H.C.లో వైద్యమందించి కొంతమందిని ఇంటికి పంపగా మరో 16 మందికి సీరియస్ గా ఉండటంతో మక్తల్ హాస్పిటల్ కు ఆ తర్వాత మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతోపాటు విచారణకు ఆదేశించారు.