ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని ఫామ్ హౌజ్ లో అస్వస్థతకు గురైన సాయిచంద్ ను తొలుత నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ తరలించగా… అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాష్ట్ర సాధన, సాంసృతిక ఉద్యమంలో ఎనలేని సేవలందించిన సాయిచంద్… BRS నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించేవారు. ఆయన సేవల్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. సాయిచంద్ మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చిన్న వయసులోనే ప్రజా గాయకుడు కన్నుమూయడం కలచి వేసిందని అన్నారు.

చిన్నప్పట్నుంచే కళాకారుడిగా…
1984 సెప్టెంబరు 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ జన్మించారు. పీజీ చదువుకున్న సాయిచంద్… విద్యార్థి దశ నుంచే గాయకుడు, కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. ఎన్నో సభల్లో పాల్గొని తెలంగాణ వాసుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అధికార BRSకు అనుబంధంగా సేవలందిస్తూనే ఉన్నారు. 2021 డిసెంబరు 24న సాయిచంద్… రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.