Published 13 Nov 2023
కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత భారీయెత్తున అధికారుల బదిలీలు జరుగుతాయని ప్రచారం సాగుతుండగా.. ఇప్పటికే పలువురు సీనియర్ IPSలకు రేవంత్ సర్కారు కీలక పోస్టింగ్ లు ఇచ్చింది. ఇక రానున్నది IASల వంతు కాగా.. ఇలాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కొత్త సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ ఆమె ఎక్స్(ట్విటర్) ద్వారా పంచుకున్నారు. సివిల్ సర్వీసెస్ కు ఎంపికై 23 ఏళ్లయిన సందర్భంగా స్మిత ఈ విధంగా ట్వీట్ చేశారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో దిగిన ఫొటోను షేర్ చేస్తూ కొత్త సవాళ్లకు ఎప్పుడూ రెడీగా ఉంటానని, మనం ఎంత ముందుకు వెళ్లామో కొన్ని ఫొటోలు గుర్తు చేస్తాయన్నారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తోందని, ఇన్నాళ్లూ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ఈ మధ్యనే నీటిపారుదల శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. రజత్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత ఆమెకు ఈ పోస్టు దక్కింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచీ ఆమె ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన సమీక్ష(Review)కు కూడా హాజరు కాలేదు. కీలక స్థానాల్లో ఉన్న సిన్సియర్ ఐపీఎస్ అధికారులకు మంచి పోస్టింగ్ లు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. పాత ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టింగ్ ల్లో పనిచేసిన వారికి స్థానచలనం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.