Published 08 Jan 2024
కేసీఆర్ ప్రభుత్వ పదేళ్ల పాలనా కాలంలో కీలక బాధ్యతలు(Postings) నిర్వర్తించిన సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్. ఈ మధ్యకాలంలో ఆమె వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా కొత్త బాధ్యతలు తీసుకోవడంతోపాటు బిల్కిస్ బానో వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత పోస్టింగ్ ఇవ్వకముందే.. కొత్త సవాళ్లకు రెడీ అంటూ ‘X(ట్విటర్)’ పోస్ట్ చేశారు. బ్యూరోక్రాట్లంతా ముఖ్యమంత్రి రేవంత్ కు అభినందనలు తెలియజేసినా ఆమె మాత్రం CMను కలవలేదు. స్మితకు పెద్దగా ప్రాధాన్యం ఉండబోదని అనుకుంటున్న తరుణంలో నిజంగానే ఆమె హోదాకు తగ్గ ప్రాధాన్యత లేని(Loop Line) ఆర్థిక శాఖ సభ్య కార్యదర్శి(Member Secretary)గా పంపించారు.
బిల్కిస్ బానో కేసుపై…
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మందిని ముందుగానే జైలు నుంచి(Remission) విడుదల చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. కోర్టు ఆదేశాల్ని సమర్థిస్తూ స్మిత ట్వీట్ చేశారు. ‘చాలా రోజుల తర్వాత గొప్ప వార్త విన్నాను.. ఇందుకోసం సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు.. ఈ తీర్పు ఒక్క బిల్కిస్ బానోకే కాదు, మహిళందరికీ న్యాయంపై నమ్మకం ఏర్పడింది’ అంటూ పోస్ట్ చేశారు.
నూతన బాధ్యతలపైనా…
అటు ఆర్థిక శాఖలో బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్. హృదయంతో పనిచేస్తే అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి.. నేను ఈరోజు కొత్త బాధ్యతల్లో చేరుతున్నాను అంటూ ట్వీట్ ఉంచారు. గతంలో ఇదే కేసులో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ప్రకటించడాన్ని స్మిత సబర్వాల్ ఖండించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు.