ఒకే గురుకుల(Gurukula) పాఠశాలలో గత కొద్దిరోజుల్లోనే ఆరుగురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. నిన్న ఒకరు, ఈరోజు మరొకరు పాముల(Snakes) బారిన పడటం ఆందోళనను కలిగించింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్లోని తెలంగాణ రెసిడెన్షియన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈరోజు పొద్దున యశ్విత్ అనే విద్యార్థిని పాము కాటు వేసింది. వెంటనే అతణ్ని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిన్ననే ఒక విద్యార్థి సైతం ఇదే తీరుగా బాధితుడయ్యాడు. గత కొద్దికాలంలోనే ఆరుగురు పాముల బారిన పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మూడు నెలల క్రితం వారం వ్యవధిలో ముగ్గురు పాముకాటుకు గురైతే అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై వైదారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. బాధిత పిల్లలకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరుట్ల హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ప్రిన్సిపల్ మాధవీలతను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలిచ్చారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమంటూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.