Published 30 Jan 2024
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు(Special Officers)గా దిగువ శ్రేణి ఉద్యోగులు కాకుండా గెజిటెడ్(Gazetted) అధికారులనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తమకన్నా పైస్థాయి కలిగిన అధికారులే ఉండాలని పంచాయతీ కార్యదర్శులు కోరిన దృష్ట్యా అన్నిచోట్లా గెజిటెడ్ అధికారులకే బాధ్యతలు అప్పజెప్పాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాలన గాడి తప్పకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారుల వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని రేవంత్ సర్కారు భావించింది.
అందులో భాగంగా తొలుత నాన్-గెజిటెడ్ ఉద్యోగుల్ని ఒక్కో పంచాయతీ లెక్కన నియమించాలని అనుకున్నారు. అయితే నాన్-గెజిటెడ్ అధికారుల పట్ల వ్యతిరేకత రావడంతో కేవలం గెజిటెడ్ అధికారుల వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. టైపిస్టులు, టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల నియామకాలపై పంచాయతీ సెక్రటరీలు తమ అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా సర్కారుకు చేరవేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శు(Panchayat Secretaries)ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చారు.
విధుల్లో ఉండేవారు వీరే…
తహసీల్దార్లు(TAHSILDARs)
ఎంపీడీవోలు(MPDOs)
మండల పంచాయతీ అధికారులు
పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్లు(AEs)
డిప్యుటీ తహసీల్దార్లు(DTs)
మండల విద్యాధికారులు(MEOs)
వ్యవసాయాధికారులు(AOs)
గెజిటెడ్ హెడ్మాస్టర్లు
గ్రామీణ నీటి సరఫరా(RWS-మిషన్ భగీరథ) అసిస్టెంట్ ఇంజినీర్లు
ICDS సూపర్ వైజర్లు
పశువైద్యాధికారులు
హెల్త్ సూపర్ వైజర్లు
ఉద్యానవన శాఖ(Horticulture) అధికారులు