రాష్ట్ర పభుత్వ ఉద్యోగులు(State Employees) రెండేళ్లుగా DAలు ఎప్పుడొస్తాయా అన్న ఆశతోనే కాలం గడుపుతున్నారు. లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటివరకు 5 DAల కాలం గడిచిపోగా.. ఈ జులైకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రానందున నాలుగు DAల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అప్పట్నుంచీ అంతే…
2022 జులై.. 2023 జనవరి, జులై.. 2024 జనవరికి గాను DAలు అందాలి. సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు DA ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వాలూ వాటిని ఇవ్వడం ఆనవాయితీ. కేంద్రం ఎప్పటికప్పుడు ఇస్తున్నా రెండేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు PRCని వేసి, 5 శాతం మధ్యంతర భృతి(IR) ఇస్తామని అప్పటి సర్కారు తెలిపింది. వాటితోపాటు DAల సమస్యలు తేల్చాలని అడుగుతున్నా అప్పట్నుంచి ఇప్పటిదాకా ఊసే లేదని ఉద్యోగులు బాధపడుతున్నారు.
నాలుగూ సేమ్…
2022 జులై DA 4% శాతం ఇస్తూ 2022 సెప్టెంబరు 28న కేంద్రం ప్రకటించింది. 2023 జనవరికి 4 శాతాన్ని మార్చి 24న… జులై 4 శాతాన్ని అక్టోబరు 18న.. ఇక 2024 జనవరి 4 శాతాన్ని ఫిబ్రవరిలో కన్ఫర్మ్ చేసింది. ఈ DAలకు సంబంధించి ఒక్కోటి 3.64% చొప్పున మొత్తం నాలుగింటికి 14.56% రావాల్సి ఉంది. ఒక్కో DA రూ.1,700కు అటూఇటు వేసుకున్నా ఇంచుమించు రూ.6500-7000 రావాల్సి ఉంది.
డిప్యూటీ CM హామీతో…
త్వరలోనే శుభవార్త వింటారని స్వయంగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క మండలిలో ప్రకటించడంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే తగినంత నిధులు లేవని చెప్పడంతో.. మళ్లీ సందేహం ఏర్పడింది. ఈ నాలుగు DAల్లో ఎన్నింటిని ఇస్తారన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. అయితే ఆగస్టు 1న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం టేబుల్ పైకి వస్తుందా.. వస్తే ఎలాంటి నిర్ణయం రాబోతుందనేది సస్పెన్స్ గా మారింది.