టెట్(TET) విషయంలో రాష్ట్ర పభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చాలా సంవత్సరాలుగా DSC నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో నెలకొన్న నిరాశానిస్పృహల్ని గుర్తించిన సర్కారు.. ఎక్కువ మంది డీఎస్సీ రాసేలా దానికి ముందే టెట్ ను నిర్వహించాలని నిర్ణయించింది. తాజాగా ప్రకటించిన DSCని టెట్ తర్వాతే జరపాలని నిశ్చయించింది. ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు(Orders) కూడా జారీ చేసింది.
ఎక్కువ మందికి ఛాన్స్
ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. DSCకి ముందే టెట్ నిర్వహిస్తే మరింత ఎక్కువ మందికి అవకాశం కల్పించనట్లవుతుందని ప్రభుత్వం భావించింది. నిర్ణయించిన వెంటనే టెట్ నోటిఫికేషన్ పై విద్యాశాఖ కమిషనర్ కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ రెడీ అవుతున్నది. ఇప్పటికే DSC నోటిఫికేషన్ జారీ కాగా దరఖాస్తుల స్వీకరణ మొదలైన సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వంలో
BRS ప్రభుత్వ హయాంలో గతేడాది 5,089 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసిన విద్యాశాఖ… దానికి మరిన్ని పోస్టుల్ని జత చేసి మరోసారి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల సంఖ్య పెంచాలంటూ బీఎడ్, డీఎడ్ క్యాండిడేట్స్ గతంలోనే పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 పోస్టుల్ని రిక్రూట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు.. మొత్తంగా 11,062 ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది. ఈ లెక్కన పాత నోటిఫికేషన్ కు అడిషనల్ గా 5,973 పోస్టుల్ని కలిపారు. పోస్టులు రెట్టింపైన దృష్ట్యా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న భావనతో.. టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది.