నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయో పరిమితి(Age Limit) రెండేళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న 44 సంవత్సరాల వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ(General Admistration Department) ఆర్డర్స్ ఇచ్చింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి త్వరలోనే ఖాళీల్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు… మంత్రులు పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అందుకనుగుణంగా ఇప్పుడు గరిష్ఠ వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతోమంది అభ్యర్థులకు మేలు జరగనుంది.
నోటిఫికేషన్లు లేక…
చాలా ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వేల సంఖ్యలో అభ్యర్థుల వయసు దాటిపోయింది. దీంతో ఇలాంటి వారంతా తాజా నోటిఫికేషన్లకు అప్లికేషన్లు ఇచ్చుకునే అవకాశం లేకుండా పోవడం వారిని తీవ్రంగా కుంగదీస్తున్నది. గత BRS ప్రభుత్వంలో గరిష్ఠ వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచారు. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అప్పటి ముఖ్యమంత్రి KCR శాసససభా వేదికగా ప్రకటించడంతో… ఆ మేరకు వయో పరిమితిని పెంచారు. పెంచిన వయో పరిమితి గడువు 2024 మార్చి 18 వరకు ఉంటుంది. ఈ లోపే మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఏజ్ దాటిన నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు వచ్చాయి.
Published 12 Feb 2024