
ఖర్గే, రాహుల్ తో ముఖ్య నేతల భేటీ
3 జిల్లాలకు చెందిన 40 మంది లీడర్లతో చర్చ
వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని, ఆలోచించి అడుగు వేస్తే ఆపేవారెవరూ లేరని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర లీడర్లకు సూచించింది. ‘ఘర్ వాపసీ’తో… ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే… రాష్ట్ర ముఖ్య నేతలతో దిల్లీ సెంట్రల్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. పార్టీలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, అరికెల నర్సారెడ్డితో ఖర్గే, రాహుల్ సమావేశమయ్యారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొంతమంది లీడర్లు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారిద్దరికీ వివరించారు. కాంగ్రెస్ నుంచి వెళ్లినవారంతా తిరిగి సొంతగూటికి రావడాన్ని ‘ఘర్ వాపసీ’గా అభివర్ణించిన రాహుల్… స్వయంగా అక్కడున్న వారితో ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో’ నినాదాన్ని చెప్పించారు. ఈ భేటీలో కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

జులై 2న భారీ సభ…
మహబూబ్ నగర్, ఖమ్మం నుంచే కాకుండా నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోని అసంతృప్తులను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవాలని AICC చీఫ్ ఖర్గేతోపాటు రాహుల్… పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. వీలైనంత ఎక్కువగా చేరికలు ఉంటే మనం బలంగా ఉన్నట్లు ప్రజల్లోకి మెసేజ్ వెళ్తుందని, తద్వారా ఎన్నికల్లో BRSను సులువుగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఖమ్మంలో జులై 2న నిర్వహించే సభ ద్వారా స్పష్టమైన సంకేతాన్ని అందివ్వాలని, తమతో టచ్ లో ఉన్న BRS నేతలే లక్ష్యంగా పావులు కదపాలన్నారు. ప్రస్తుతానికి ఈ టాప్ లీడర్స్ తో దిల్లీలో మొత్తం 40 మంది దాకా భేటీ కాగా… పార్టీలోకి వచ్చే మిగతా వారితోనూ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

సభకు లీడర్ల హాజరుపై రాని క్లారిటీ
స్టేట్ లీడర్లకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాహుల్, ఖర్గే పిలుపునిచ్చారు. పొంగులేటి, జూపల్లి సహా అగ్రనేతల్ని కలిసిన నాయకులు.. ఖమ్మం సభ ద్వారా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే తమతో టచ్ లో ఉన్న లీడర్లతోపాటు మరింత మందిని ఖమ్మం సభ నాటికి పార్టీలో చేర్చుకునేలా సంప్రదింపులు జరుపుతామని రాష్ట్రనేతలు పార్టీ పెద్దలకు వివరించారు. ఖమ్మం సభకు రావాల్సిందిగా ఆ ఇద్దర్నీ కోరినా, దానిపై రాహుల్, ఖర్గే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడే డిసిషన్ తీసుకోకపోయినా పరిస్థితిని బట్టి ఆలోచన చేస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ నేతలు అంటున్నారు.