తల్లిదండ్రుల్ని కోల్పోయి, అయినవారు లేక అనాథలుగా మారిన పిల్లల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ప్రకటించిన దృష్ట్యా అందుకోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వైజాగ్ లో పర్యటించింది. భీమునిపట్నం వద్ద గల SOS చిల్ట్రన్ విలేజ్ ను మంత్రితో కూడిన అధికారుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు మహిళల బృందం.. వైజాగ్ చిల్ట్రన్ విలేజ్ మేనేజ్ మెంట్ తీరును అబ్జర్వ్ చేసింది. అభాగ్యులుగా మారిన పిల్లలను అనాథలుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలన్న CM కలల మేరకు.. ఈ టూర్ లో పలు విషయాలు గుర్తించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. SOS చిల్ట్రన్ విలేజ్ లో పరిశీలించిన అంశాలతో రిపోర్ట్ తయారు చేస్తామన్నారు.
దత్తత తీసుకున్న పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించే బాధ్యతలకు ఈ పర్యటన తోడవుతుందని, అక్కున చేర్చుకున్న పిల్లలంతా జీవితంలో స్థిరపడే వరకు వారిని కాపాడుకునేలా కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ అందజేస్తుందని సత్యవతి రాథోడ్ తెలిపారు. మంత్రితోపాటు CMO ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, CM ఆఫీస్ OSD ప్రియాంక వర్గీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ భారతి హోళికేరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, GHMC అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఈ టూర్ లో పాల్గొన్నారు.