కార్పొరేట్ షాపులకు వెళ్తే ముందుగా డబ్బు చెల్లిస్తేనే వస్తువులిస్తారు.. అంతోఇంతో పరిచయమున్న దుకాణాలు తప్ప నగదు లేనిదే ఎక్కడా వస్తువు ముట్టదు. కానీ రైతులకు వచ్చేసరికి ఇది ఉల్టాపల్టా అవుతున్నది. ఇక్కడ వస్తువు ఇచ్చి ఏడాది గడుస్తున్నా పైసలు మాత్రం చేతికి రావడం లేదు. ముందుగా పెట్టుబడులు పెట్టి పంటలు వేయడం.. అది చేతికందేదాకా కళ్లార్పకుండా కాలంపైనే ఆశలు పెట్టుకుని ఎలాగోలా పంటను దక్కించుకుంటే.. అమ్మిన సరకు కూడా డబ్బులు రాని దుస్థితి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కనిపిస్తున్నది. అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చెరుకు సాగుదారులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇచ్చిన పంటకు డబ్బులు ఇవ్వకపోగా.. ఉన్న ఫ్యాక్టరీని కూడా మూసివేయడంతో దాన్ని తెరిపించాలంటూ వేలాది మంది రైతులు రోడ్డెక్కారు.
చెరుకు బిల్లులు చెల్లించడంతోపాటు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలంటూ రైతులు పెద్దయెత్తున ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో.. అల్గోల్ బైపాస్ రోడ్డు నుంచి టౌన్ మెయిన్ రోడ్డు మీదుగా అంబేడ్కర్ చౌరస్తా దాకా భారీ ర్యాలీ తీశారు. జేఏసీ(Joint Action Committee) ఆధ్వర్యంలో సాగిన ర్యాలీకి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. తమకు ఆధారమైన ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని తెరవాలంటూ చెరకు రైతులు పెద్దయెత్తున ఉద్యమించారు. మహాధర్నాకు విశేష సంఖ్యలో తరలివచ్చి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. కొత్తూరు ట్రైడెంట్ ఫ్యాక్టరీకి చెరుకు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై స్థానిక మంత్రి హరీశ్ రావుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. మరోవైపు వచ్చే పంటకు పెట్టుబడులు లేవని, పాత బాకీల్ని తిరిగి ఇస్తే కొత్త పంటలు వేసుకునే అవకాశం ఉంటుందంటూ ఇప్పటికే కలెక్టర్ ను కూడా కలిశారు. ఇలా ఎవరూ కనికరించకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు.. మూకుమ్మడిగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. వేల సంఖ్యలో తరలివచ్చిన రైతులతో జహీరాబాద్ పట్టణం.. జనసంద్రంగా మారిపోయింది.
కాంగ్రెస్, BJP, తెలంగాణ జనసమితి, BSP, వామపక్షాలతోపాటు సామాజిక ఉద్యమకారుడు దిల్లీ వసంత్.. కర్షకులకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. TJS అధ్యక్షుడు కోదండరామ్ సైతం రైతులతోపాటు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాస్తవానికి ఈ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు రూ.12 నుంచి రూ.14 కోట్ల వరకు ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఫ్యాక్టరీ తెరిస్తే 7 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఉన్న పంటను అమ్ముకుని మళ్లీ కొత్త పంటను వేసుకోవచ్చు. కానీ దాన్ని మూసివేయడం వల్ల జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని నిరసిస్తూ చాలా కాలంగా రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరమే కాదు.. గత నాలుగేళ్లుగా బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో ఏటా బాధలు పడుతూనే ఉన్నారు.