విద్యాలయాల్లో భోజనం వికటించిన(Food Poison) ఘటనలు ఆందోళన కలిగిస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మాగనూరు ZP హైస్కూల్లో వారం వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు హాస్పిటల్ పాలైన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటవగా, అందులో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్ తోపాటు జిల్లా స్థాయి అధికారి ఉంటారు. ఈ మేరకు కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను CS ఆదేశించారు.
పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో ప్రధానోపాధ్యాయుడుతోపాటు సదరు స్కూల్ కు చెందిన ఇద్దరు స్టాఫ్ కూడా ఉండనున్నారు. వంటకు ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించడంతోపాటు ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలతోపాటు ఆసుపత్రుల్లోనూ ఈ కమిటీ ఫుడ్ క్వాలిటీ పరిశీలిస్తుంది. కలెక్టర్లు తరచూ తనిఖీ చేయాలని, వాటికి సంబంధించిన రిపోర్టుల్ని ఎప్పటికప్పుడు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల యంత్రాంగాల్ని ఆదేశించారు.