
మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 10 Jan 2024
ఉపాధ్యాయుల(Teachers) బదిలీలు(Transfers), పదోన్నతుల(Promotions) విషయంలో ఎంతటి గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. గత జనవరిలో మొదలైన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఏడాది గడుస్తున్నా ముందుకు సాగడం లేదన్నది కాదనలేని నిజం. ఎడాపెడా వేస్తున్న కోర్టు కేసులతో న్యాయపరమైన చిక్కులు ఎదురై ముందుకు కదల్లేని వాతావరణం కనిపిస్తోంది. పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఇకనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో అన్వేషణ ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖలో ఇబ్బడిముబ్బడిగా లీగల్ కేసులు పేరుకుపోతుండటంతో.. వాటిని ఎప్పటికప్పుడు రివ్యూ చేయడానికి ప్రత్యేక పోర్టల్ ను తీసుకురావాలని నిర్ణయించింది.
అన్నీ ఈ పోర్టల్ ద్వారానే…
కొత్త జిల్లాల వారీగా టీచర్లను కేటాయించడం అన్నది ఇపుడున్న పరిస్థితుల్లో కత్తిమీద సాములా తయారైంది. కంటిన్యూగా వేస్తున్న కేసులతో న్యాయస్థానం ఇస్తున్న ఆదేశాలు.. టీచర్ల సమస్యల్ని పెండింగ్ లో పెడుతున్నాయన్న అభిప్రాయానికి వచ్చిన సర్కారు.. మొత్తంగా 4,000కు పైగా కేసుల్ని పరిష్కరించే దిశగా ప్రత్యేక పోర్టల్ ఉండేలా కార్యాచరణ(Action Plan) మొదలు పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. లీగల్ కేసెస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేరిట ఈ పోర్టల్ ను రూపొందించేలా ఆలోచన చేస్తున్నారు.
కార్యాచరణ ఇలా…
ఏయే కేసుల్లో ప్రభుత్వం తరఫున ఎలా సమాధానమివ్వాలి.. తగిన సమస్యకు పరిష్కారం ఎలా చూపాలి.. అన్న కోణంలో ఈ పోర్టల్ రూపుదిద్దుకోబోతున్నది. ముఖ్యంగా సీనియారిటీ వివాదాలపైనే కొన్ని నెలలుగా బదిలీలు, ప్రమోషన్లు ఆగిపోవాల్సి వచ్చింది. మరోవైపు ‘టెట్ తప్పనిసరి’ కావడం.. అటు NCTE, ఇటు హైకోర్టు దీనిపై స్పష్టతనివ్వడంతో ఏం చేయాలనే కోణంలోనూ అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ అంశాలన్నింటినీ పోర్టల్ లో పొందుపరిచిన తర్వాత.. అందులోకి లాగిన్ అవుతూ అధికారులు ఈ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయనున్నారు. మరి ఈ కొత్త విధానంతోనైనా టీచర్ల సమస్యలు తీరతాయా అన్నది చూడాల్సి ఉంది.