ఉద్యోగుల బదిలీలపై ఇంతకాలం ఉన్న నిషేధాన్ని(Ban) రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఇక సాధారణ బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు బదిలీలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన వినతి మేరకు ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సుదీర్ఘ చర్చలతో… ఒకేచోట చాలా సంవత్సరాలు ఉండటం, అనారోగ్య సమస్యల వంటి కారణాలపై మంత్రివర్గ భేటీలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో ఇందుకు సంబంధించిన విధివిధానాల(Guidelines)ను తెలియజేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. నాలుగేళ్లు ఒకేచోట ఉన్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూన్ 30 లోగా రిటైర్ అయ్యేవారిని కదపొద్దని స్పష్టం చేసింది.
నిబంధనలివే…
* 2024 జూన్ 30 నాటికి ఒకే చోట రెండేళ్లు పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయకూడదు.
* స్పౌజ్ గ్రౌండ్స్ లో భాగంగా ఈ నిబంధనను అనుసరించాల్సిన అవసరం లేదు.
* జులై 5 నుంచి 8 వరకు శాఖాధిపతులు(HOD).. ఆయా విభాగాల్లోని ఖాళీల్ని, కచ్చితంగా బదిలీ కావాల్సిన వారి వివరాల్ని వెల్లడించాలి.
* జులై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. వీలైనంతవరకు వెబ్ ఆప్షన్లకే ప్రాధాన్యత ఇస్తారు.
* ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని జులై 13 నుంచి 18 వరకు పరిశీలన చేయాల్సి ఉంటుంది.
* బదిలీల గైడ్ లైన్స్, కోర్టు ఆదేశాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు వంటివి పరిశీలించిన తర్వాత జులై 19 నుంచి 20 తేదీల్లో బదిలీలు చేపట్టే విధంగా నిబంధనలు రూపొందించారు.
* దంపతులు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.